పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

పద్మసంభవదేవి .....

 పద్మసంభవదేవి బాహుబంధమ్ముల నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి , సత్యా వసంతుని సరస సల్లాపాల ప్రణయ గాధల చెలువార తనిసి ,           రాధికా రమణి చేరంగ రాసక్రీడ సలిపిన మధుర ప్రసంగము విని , బృందావన విహార ప్రియ‌సమాగమ వినుత రస పిపాస విథము దెలిసి , విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు , చేరి  , వసుదేవ సుతుని , నోరార , పాడి , ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .

కానివాడిన ?

కృష్ణ పరబ్రహ్మ కెరగి ప్రార్థింతు , గాని , కనికరించ డదేమిటో కరివరదుడు ! కానివాడిన ?  ఇంతగా కఠిన వైఖ రి గొన ,  ఔనులే , నేనేమి ప్రియ సఖుడన ?

ఏ పాదములు .....

 ఏ పాదములను సేవించ నిశ్చింతగా జనుల జీవితములు సాగిపోవు ఏ పాదముల్ యిల కేడుగడయయి ధ ర్మమ్ము నిల్ప నవతరణము దాల్చె ఏ పాదముల స్పర్శ ఈ భరత యవనిన్ పరమ పావనగాగ విరియ జేసె ఏ పాద ధూళికై యిలను పెక్కేడులు నిరతము మునులు ధ్యానించి గనిరి అట్టి పరమాత్మ పాదము లందు , పూని మనసు నిల్పితి నీ జన్మ మందు , నడుగొ ! కృష్ణ పరబ్రహ్మ , గోపికా బృంద సహిత రాస  కేళీ  వినోద  విలాసనముల .

ఏ మనుభవించె కృష్ణయ్య .....

 ఏ మనుభవించె కృష్ణయ్య ,  భూమి పైని , పుట్టుకా , చెఱసాలలో , యెట్టు లెటులొ గొల్ల లిండ్లను బెరిగె ,  మేనెల్ల యాల ధూళి దూసరితమయి దులకిసపడ . మేనమామ శత్రువయి యేమేమొ చేసె తనను చంపించ , తలిరాకు తనమునందె గదిసి పోరాడ వలసె , రాకాసి గమిని , యేరికైనను నిట్టి రాయిడులు గలవె ! ఆల గాచెను , మన్నుల రాల విపిన తలములన్ , యెండ లనక , వాన లన కకట ! అలసి సొలసి , కఠిన వృక్షముల మొదలుల నిద్దురోయెను , ముద్దు మో మద్దె  మురికి . రాచపుటక బుట్టె , మధుర రస విరాజ మాన , పంచభక్ష్యంపు సమ్మాన భోజ నమ్ము లేవి ?  వెన్నలకు ప్రాణమ్ము లూన , గొల్ల లిండుల గోరాడె ,  గోస బడియె . రాధతో గూడి , యమునా తటీ , ధరాది తల , లతా నికుంజముల , నితాంత ప్రణయ జలధి , మునిగిన తన ప్రేమ ఫలిత మేమి ? తుదకు యెడబాటె మిగిలెను , యెద బొగిలెను . కడకు , కొడుకుల గోల్పడి , కడుపు రగిలి ఇంతకును కారణమ్ము ' నీవే ' యటంచు , పూని గాంధారి శపియించె , మునిగె నీట ద్వారకాపురి  యాదవుల్ పడిరి చచ్చి . ఇన్నియును ముందె తెలిసియు , మిన్నకుండె , తను పరమాత్మ యయ్యును , ధరణి పూని ధర్మమును నిల్ప అవతారధారి యైన కృష్ణ పరమాత్మ , తప్పునే ! కర్మ ఫలము  ! యదా ...

హరి కొలువు దీరిన , డెందముల్ చెలువు మీరు

 కృష్ణ పరమాత్మ , మూర్తిమత్ కీర్తి గాన మొనరిచి , మహాత్ము లెందరో పుణ్యు లైరి , మనసు సుశ్లోకమై , స్వఛ్ఛతను గను , హరి కొలువు దీరిన , డెందముల్ చెలువు మీరు .

శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే నమ:

 పరగ ' శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే న మ '  - యని , పరమాత్మ దలచి , నమస్కరించి కెరలి సాష్టాంగ పడి మ్రొక్కి శరణు కోరి యేది వేడిన , హరి యిచ్చు , నిది నిజమ్ము .

ముకుందు స్థితి మనలోనే

 అంతర్యామిని కనుగొన నంతట వెదికేరు , కృష్ణు డడుగో ! యెదలో చెంతనె కొలువై యుండెడు , చింత దొరంగుడు , ముకుందు స్థితి మనలోనే .

అచ్యుతా ! నాకు నువ్వన్న , అద్భుతమ్ము

 నాకు నువ్వన్న ప్రేమ , కృష్ణా హరీశ  ! నాకు నువ్వన్న మధుసూధనా ! జిగీష , నాకు నువ్వన్న భక్తి , అనంతశయన ! అచ్యుతా ! నాకు నువ్వన్న , అద్భుతమ్ము .

హరి రావే, మాధవా! అచ్యుతా!

 జవ సత్వంబులు నీవె , బుధ్ధిమయ తేజంబీవె , ఆలోచనా జవనాశ్వంబవు నీవె , కార్యగత బీజంబీవె గాదే ! ఇకన్ , వివరం బేలర?నేను నీవె , హరి రావే, మాధవా! అచ్యుతా! నవ నీరేజ లతాంత మాలికల కృష్ణా ! నిన్ను అర్చించెదన్ .

శ్రీకృష్ణ సత్య

 హరికి పన్నీట నభ్యంగనము వెలార్చి , పరిమ ళాగరు ధూప పసదు వేసి , పసిడి పుట్టము గట్టి , పచ్చని పైపంచ పచ్చడంబు భుజము పైన వేసి , ముత్యాల పేరులు మురువుగా దిగిసిన వజ్రాల మకుటము వలను గూర్చి  పచ్చకప్పురపు సొబగులు పైనలదిన  తిరుమణి నుదుటిపై తీర్చి దిద్ది ,  తలకు శిఖిపింఛ మొకప్రక్క వెలయ జేసి , జన్మ జన్మల నిటువలె , జలజ నాభు తనువు , కైసేయు భాగ్యము , తనకె కలుగ పతిని వరమడిగెను సత్య ,  పరమ పూజ్య .

ఎందరో కృష్ణభక్తులు.....

 గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ రసమయ కావ్యమై , రాణ కెక్కె భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ తత్వమున్ , తెలుగుల తలల నిల్పె పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే లను , కృష్ణ మోహనాలను దృశించె సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను వాసుదేవుని ,  తెల్గు వాకిటికిని  ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి ‌సుగతి బడసిరి , నేనును చూరగొనెద , కృష్ణ దామోదరు వొగిడి ,  కేలు మొగిడి . 🙏