పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

భక్తుల పాద రజము .....

పద్మసంభవదేవి బాహుబంధమ్ముల నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి , సత్యా వసంతుని సరస సల్లాపాల ప్రణయ గాధల చెలువార తనిసి ,           రాధికా రమణి చేరంగ రాసక్రీడ సలిపిన మధుర ప్రసంగము విని , బృందావన విహార ప్రియ‌సమాగమ వినుత రస పిపాస విథము దెలిసి , విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు , చేరి  , వసుదేవ సుతుని , నోరార , పాడి , ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .

కృష్ణ పరమాత్మ

  పండితోత్కర్షకు పట్టువడ డితండు సదమల భక్తి పాశమున గాని , రాజ రాజోన్నత రాజసములకు గాదు తులసీ దళానికి తూగు నితడు , భోగ లాలస భాగ్య పూజనములకు గాదు పేదింటి పూవులు ప్రియ మితనికి , మహిత మహామంత్ర మాహాత్మ్యముల గాదు తనను సమర్పించ తనియు నితడు , కృష్ణు డితడు , సనాతన విష్ణు డితడు , వాసుదేవుడితడు , భక్త వరదు డితడు , తనను నమ్మిన వారికి , త్రాత యితడు , నెమ్మి , యెదలోన కొలువయ్యె , నమ్మి కొలుతు .

కృష్ణమ్ వందే 🙏 జగద్గురుమ్

భక్తి రసము మించి , పరవశత్వము లేదు హరిని మించి , ఆసరా కలుగదు పరబ్రహ్మ కలడన్న భద్రత కంటెను , లోకమందు కడు భరోస లేదు .